ఉల్లి చేసే మేలు... తల్లి కూడా చేయదు' అంటారు. అవును మరి... అందుకే ఆరోగ్యాన్ని కాపాడే ఉల్లి వేయకుండా కూరవండరు ఎక్కువమంది. అయితే ఏదో ఒక కూరలో వేయడం కాకుండా ఉల్లిగడ్డతోనే రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. ఒక్కోసారి ఇంట్లో కూరగాయలు నిండుకుంటాయి. అలాంటప్పుడు కూడా... ఈ వంటలు వండుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం... వెంటనే ట్రై చేయండి.
ఉల్లితో మసాలా కూర తయారీకి కావాల్సినవి
- ఉల్లిగడ్డ తరుగు: రెండు కప్పులు
- అల్లం తరుగు: అర టీ స్పూన్
- వెల్లుల్లి తరుగు: అర టీ స్పూన్
- కరివేపాకు: మూడు రెమ్మలు
- పసుపు: అర టీస్పూన్
- ధనియాల పొడి: ఒక టేబుల్ స్పూన్
- ఉప్పు: తగినంత
- కారం: రుచికి తగినంత
- నిమ్మరసం: ఒక టీస్పూన్
- టొమాటో తరుగు: అర కప్పు
- గరం మసాలా: పావు టేబుల్ స్పూన్
- నూనె: సరిపడా
తయారు చేయు విధానం: స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ఉల్లిగడ్డ తరుగు, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి వేగించాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి తరుగు, పసుపు వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత ధనియాల పొడి, కారం వేసి మగ్గనివ్వాలి. ఆపైన నిమ్మరసం, గరం మసాలా, టొమాటో తరుగు వేసి మూత పెట్టాలి. మిశ్రమం దగ్గరికయ్యాక కొత్తిమీర తరుగు వేసి దింపేయాలి. ఉల్లిగడ్డ మసాలా కూరను అన్నం లేదా చపాతీల్లో తింటే టేస్ట్ అదిరిపోతుంది.
ఉల్లి పచ్చడి తయారీకి కావలసినవి
- ఉల్లిగడ్డ తరుగు: రెండు కప్పులు
- ఎండుమిర్చి: పదకొండు
- చింతపండు గుజ్జు: అర కప్పు
- ఉప్పు: తగినంత
- నూనె: సరిపడా
- వెల్లుల్లి రెబ్బలు: ఐదు
- జీలకర్ర: పావు టీ స్పూన్
- ఆవాలు: పావు టీస్పూన్
- కరివేపాకు: ఒక రెమ్మ
- ఇంగువ: చిటికెడు
తయారు చేయు విధానం: స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. అందులో తొమ్మిది ఎండుమిరపకాయలు, ఉల్లిగడ్డ తరుగు, కొద్దిగా ఉప్పు వేసి బాగా వేగించాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. మిశ్రమం బాగా మగ్గాక... స్టవ్ మీద నుంచి పాన్ దించాలి. మిశ్రమం చల్లార్చి మిక్సీ లేదా రోట్లో రుబ్బాలి. మళ్లీ స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. దాంట్లో దంచిన వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, ఇంగువ, కరివేపాకు, రెండు ఎండుమిర్చి వేయాలి. నిమిషం తర్వాత ఆ పోపును ముందుగా రుబ్బుకున్న ఉల్లిగడ్డ మిశ్రమంలో వేయాలి. అంతే, ఘుమఘుమలాడే ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే... ఆహా ఏమి రుచి అనాల్సిందే.
ఉల్లి పులుసు తయారీకి కావాల్సినవి
- చిన్న ఉల్లిగడ్డలు (మార్కెట్లో దొరుకుతాయి): పన్నెండు
- నూనె: సరిపడా
- పచ్చిమిర్చి తరుగు: ఒక టీ స్పూన్
- కొత్తిమీర తరుగు: పావు కప్పు
- చింతపండు గుజ్జు: రెండు టేబుల్ స్పూన్లు
- కారం: ఒక టీ స్పూన్
- బెల్లం తురుము (కావాలనుకుంటే): రెండు టీ స్పూన్లు
- శెనగపిండి: రెండు టీ స్పూన్లు
- ఉప్పు: తగినంత
- ఆవాలు: అర టీ స్పూన్
- జీలకర్ర: అర టీ స్పూన్
- మెంతులు: అర టీ స్పూన్
- కరివేపాకు: రెండు రెమ్మలు
తయారు చేయు విధానం..ఉల్లిగడ్డల మీదున్న పైపొట్టు తీసి రెండువైపులా చివర్లు కట్ చేయాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేయాలి. తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి తరుగు, కారం వేసి వేగించాలి. చింతపండు గుజ్జు, సరిపడా నీళ్లు, ఉప్పు, బెల్లం తురుము వేసి కలపాలి. ఉల్లిగడ్డలు ఉడికాక శెనగపిండి వేసి కలపాలి. రెండు నిమిషాలు పులుసు మసిలాక దింపేయాలి. చిన్న ఉల్లిగడ్డలకు బదులు పెద్దసైజు ఉల్లిగడ్డ ముక్కలతోనూ పులుసు చేసుకోవచ్చు. అన్నం లేదా జొన్న గట్కలో ఈ పులుసు తింటే బాగుంటుంది.